once known for political clashes kapparla village finds silence through a library

రాజకీయ గొడవల ఊరు ఇప్పుడు నిశ్శబ్దం కప్పర్ల గ్రంథాలయం యువతకు ఉద్యోగాల దారి చూపింది

16

Published: 📅
Reported by: 🖊 Eswar Pavan

ఒకప్పుడు రాజకీయ గొడవలు, వర్గ విభేదాలు, ఉద్రిక్త వాతావరణంతో పేరు తెచ్చుకున్న ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్ల గ్రామం ఇప్పుడు పూర్తిగా భిన్నమైన కారణంతో వార్తల్లో నిలుస్తోంది. అక్కడ ఇప్పుడు గొడవల శబ్దం కాదు, చదువు కోసం కూర్చున్న యువత నిశ్శబ్దం కనిపిస్తోంది. ఈ మార్పుకు కారణం గ్రామస్థులే స్వయంగా నిర్మించుకున్న గ్రంథాలయం.

5,628 మంది జనాభా ఉన్న కప్పర్లలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత ప్రతిరోజూ ఆదిలాబాద్ గ్రంథాలయానికి లేదా ప్రైవేటు స్టడీ హాళ్లకు వెళ్లాల్సి వచ్చేది. ఈ ఇబ్బందిని గమనించిన గ్రామ పెద్దలు, ఉద్యోగులు, స్థానిక నాయకులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జెండాలు, వ్యక్తిగత భేదాలు అన్నీ పక్కనబెట్టి గ్రామంలోనే ఒక చదువు వాతావరణం సృష్టించాలని నిర్ణయించారు.

2025లో గ్రామం మొత్తం ఈ లక్ష్యానికి కదిలింది. ఇంటింటికీ వెళ్లి గ్రంథాలయ అవసరం, చదువు విలువను వివరించారు. గ్రామస్థుల నుంచి విరాళాలు సేకరించి రూ.10 లక్షలు సమీకరించారు. ఆ నిధులతో గ్రామ పంచాయతీ భవనంపై గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. తర్వాత అక్కడ పోటీ పరీక్షల పుస్తకాలు, కుర్చీలు, టేబుళ్లు, చదువుకు అవసరమైన వాతావరణం కల్పించారు.

ఇక్కడ అసలు మార్పు భవనంతో ఆగలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరుద్యోగ యువత అక్కడే కూర్చొని ఉపాధ్యాయ, పోలీసు, ఆర్మీ, గ్రూప్ 3, గ్రూప్ 4, బ్యాంకు పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆ కృషి ఏడాదిలోనే ఫలితమిచ్చింది. 20 మందికి పైగా యువత వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగాలు సాధించింది.

ఒక గ్రామం మారాలంటే పెద్ద పథకాలు మాత్రమే అవసరం లేదని, సరైన ఆలోచన చాలు అని కప్పర్ల నిరూపించింది. రాజకీయ గొడవలతో పేరు తెచ్చుకున్న ఊరు ఇప్పుడు చదువుతో గుర్తింపు తెచ్చుకోవడం, యువత భవిష్యత్తుకు గ్రామం మొత్తం అండగా నిలవడం నిజంగా ఆదర్శంగా నిలిచే మార్పు.

ఆంధ్రప్రదేశ్