దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ డెలివరీ, కేవైసీ అప్డేట్, ఆధార్ లింక్ వంటి పేర్లతో నేరగాళ్లు వినియోగదారుల నుంచి ఓటీపీలు, డెలివరీ అథెంటికేషన్ కోడ్‌లు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేశాయి.
ఇటీవలి కాలంలో కొందరు సైబర్ నేరగాళ్లు గ్యాస్ ఏజెన్సీ సిబ్బందిగా పరిచయం చేసుకుని వినియోగదారులకు ఫోన్ చేస్తున్నారు. కేవైసీ పూర్తి చేయకపోతే కనెక్షన్ నిలిపివేస్తామని, ఆధార్ లింక్ చేయాలని, కొత్త ధృవీకరణ అవసరమని చెబుతూ ఓటీపీలు అడుగుతున్నారు. కొందరికి అధికారిక ఎల్‌పీజీ డెలివరీ సందేశాల్లా కనిపించే నకిలీ సందేశాలు పంపించి, అందులోని కోడ్ చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారు.
చమురు సంస్థల స్పష్టమైన సూచన ఏమిటంటే అధికారిక డెలివరీ సందేశాలు ఆయా కంపెనీల గుర్తింపు పేరుతోనే వస్తాయి. అందులో ఉండే నాలుగు అంకెల కోడ్‌ను కేవలం సిలిండర్ డెలివరీ సమయంలో సంబంధిత సిబ్బందికే చెప్పాలి. ఫోన్ కాల్, వాట్సాప్, అనుమానాస్పద లింక్, వ్యక్తిగత మొబైల్ నంబర్ ద్వారా ఎవరు కోడ్ అడిగినా చెప్పకూడదు.
గ్యాస్ బుకింగ్, కేవైసీ అప్డేట్ వంటి పనులు అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారానే చేయాలి. తెలియని లింకులను తెరవడం, వ్యక్తిగత వివరాలు నమోదు చేయడం ప్రమాదకరం. మోసానికి గురైనవారు వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలి. మొదటి గంటలో ఫిర్యాదు చేస్తే డబ్బును నిలిపివేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఎల్‌పీజీ ఓటీపీ మోసాలపై వినియోగదారులకు హెచ్చరిక
4
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan