ktr targets congress over jobs criticizes govt in assembly

ఉద్యోగాలపై కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్.. అసెంబ్లీలో విమర్శల వర్షం

4

Published on: 📅 18 Mar 2026, 12:06 PM
Reporter: 🖊 Ramesh Kumar

తెలంగాణ శాసనసభలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె.టి.రామారావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. ప్రభుత్వం 67 వేల ఉద్యోగాలు కల్పించామని చెప్పడం నిజానికి విరుద్ధమని, కేవలం 11 వేల ఉద్యోగాలే ఇచ్చారని. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలు కాలేదని, రాజీవ్ యువ వికాసం పథకం పురోగతి లేకుండా ఉందని విమర్శించారు. ఉద్యోగులకు ఆరు నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామని చెప్పినా ఇంకా అమలు కాలేదని, ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ కోసం ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే 80 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల సమస్యలపై కూడా కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సంపూర్ణ రుణమాఫీ ఎక్కడ జరిగిందో చూపించాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేయడం సరైంది కాదని, కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం సాగు ఉత్పత్తి పెరిగిందని తెలిపారు. పంట బోనస్ ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆరోపించారు.

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, గురుకులాల పరిస్థితి, ఉచిత బస్సు పథకం అమలుపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వం భూముల వ్యవహారాలపైనే దృష్టి పెట్టి ప్రజా సమస్యలను విస్మరిస్తోందని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.

Sponsored