పశ్చిమాసియాలో యుద్ధం మూడో దశలోకి వెళ్లినట్టే. ఇరాన్ వరుస దాడులతో గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలు ఒత్తిడిలో ఉన్న సమయంలో, అమెరికా బేస్‌ల్లో కొన్ని భవిష్యత్తులో ఇజ్రాయెల్ నేలపైకి మార్చే ఆలోచనపై చర్చలు జరుగుతున్నట్లు ఇజ్రాయెల్ ఛానెల్ 12ను ఉటంకిస్తూ అనడోలు, మనీకంట్రోల్ కథనాలు వెల్లడించాయి. అయితే ఇది ఇంకా చర్చ దశలోనే ఉందని, వాషింగ్టన్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదని ఆ నివేదికలే చెబుతున్నాయి.
ప్రస్తుతం అమెరికా ప్రధాన స్థావరాలు ఖతార్‌లోని అల్ ఉదైద్, బహ్రెయిన్‌లోని ఫిఫ్త్ ఫ్లీట్ హెడ్‌క్వార్టర్స్, యూఏఈలోని అల్ దఫ్‌రా, సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ వంటి చోట్ల ఉన్నాయి. ఈ స్థావరాలు గల్ఫ్ యుద్ధ నిర్మాణంలో కీలకం. ఇదే సమయంలో అమెరికా ఇప్పటికే వేలాది అదనపు సైన్యాన్ని ప్రాంతానికి పంపుతోంది. మార్చి 24న రాయిటర్స్ నివేదిక ప్రకారం మరిన్ని సైనిక బలగాలు మధ్యప్రాచ్యానికి వెళ్లనున్నాయి; మార్చి 28న మరో రాయిటర్స్ కథనం USS బాక్సర్‌తో పాటు మెరైన్‌లు, ఇతర యూనిట్లు కూడా అక్కడికి చేరాయి.
ఇరాన్ దాడులు కేవలం హెచ్చరికల దశలో లేవని తాజా పరిణామాలు చూపిస్తున్నాయి. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై దాడిలో అమెరికా E-3 సెంట్రీ AWACS విమానం దెబ్బతిన్నట్టు వార్తా కథనాలు వచ్చాయి. అలాగే అల్ ఉదైద్ సహా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సదుపాయాలపై ముప్పు పెరిగిందని రాయిటర్స్ గతంలోనే బేస్‌ల భద్రతా ఏర్పాట్లు పెరిగినట్టు నివేదించింది. అందుకే ఇజ్రాయెల్‌లో బేస్‌లు ఉంటే అమెరికాకు రక్షణ, ఇంటెలిజెన్స్, లాజిస్టిక్స్‌లో కొత్త ప్రయోజనం ఉంటుందనే వాదన ముందుకు వస్తోంది.
కానీ ఈ ఆలోచన అంత సింపుల్ కాదు. గల్ఫ్ దేశాల్లోని బేస్‌లు అమెరికాకు ఇంధన మార్గాల దగ్గర వ్యూహాత్మక పట్టు ఇస్తాయి. వాటిని ఇజ్రాయెల్‌కు తరలిస్తే గల్ఫ్ మిత్రదేశాల రాజకీయ సమీకరణాలు మారొచ్చు. మరోవైపు, ఇజ్రాయెల్‌కు పెద్దఎత్తున అమెరికా సైనిక హాజరు వస్తే అది ఇరాన్‌తో ఘర్షణను మరింత నేరుగా మార్చే ప్రమాదం ఉంది.
ఇప్పటివరకు ఇది నిర్ణయం కాదు, కానీ ప్రమాద సంకేతం మాత్రం ఖచ్చితంగా ఉంది. గల్ఫ్ బేస్‌లు వరుస దాడులకు గురవుతుండగా, అమెరికా-ఇజ్రాయెల్ సైనిక బంధం మరింత గట్టిపడుతోంది. ఇప్పుడు అందరి చూపు ఒకటే — ఈ చర్చ కాగితాలపై ఆగిపోతుందా, లేక యుద్ధం తర్వాత నిజంగానే బేస్‌ల మ్యాప్ మారుతుందా?
గల్ఫ్ బేస్‌లకు గుడ్‌బై?.. అమెరికాను ఇజ్రాయెల్‌కి లాగుతున్నారా!
14
Published on: 📅 30 Mar 2026, 03:38 PM
Reporter: 🖊 Eswar Pavan