iran foreign minister heads to islamabad ahead of talks

చర్చల ముందు ఇస్లామాబాద్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక పర్యటన

13

Published: 📅
Reported by: 🖊 Eswar Pavan

అమెరికా ఇరాన్ మధ్య నిలిచిపోయిన కాల్పుల విరమణ చర్చలు మళ్లీ ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పాకిస్థాన్ ఒమాన్ రష్యా దేశాల పర్యటనకు బయల్దేరినట్టు స్వయంగా ప్రకటించారు. పొరుగు దేశాలతో ద్వైపాక్షిక అంశాలు, ప్రాంతీయ పరిణామాలపై సమన్వయం కోసం ఈ పర్యటన చేపట్టినట్టు చెప్పారు. కానీ ఈ పర్యటన సమయం చూస్తే అసలు దృష్టి అమెరికా ఇరాన్ చర్చలపైనే ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే రెండో విడత చర్చలు మళ్లీ ప్రారంభమవుతాయా లేదా అన్న ఉత్కంఠ మధ్యనే ఈ కదలిక వచ్చింది.

ఇస్లామాబాద్ ఇప్పుడు కేవలం ఒక రాజధాని కాదు, మధ్యవర్తిత్వ వేదికగా నిలవడానికి సిద్ధంగా ఉన్న నగరంగా మారింది. పాకిస్థాన్ అధికారులు ఇరాన్ ప్రతినిధి బృందం ముందు వచ్చి అమెరికా సాంకేతిక బృందంతో చర్చల నిర్మాణాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. అమెరికా బృందం రాకపై ఇంకా పూర్తి స్పష్టత లేకపోయినా, నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాయిటర్స్ కథనం ప్రకారం చర్చలు నిజంగా మొదలవుతున్నాయన్న నిర్ధారణ లేకున్నా ఇస్లామాబాద్‌లో ఆంక్షలు కొనసాగుతుండటం అక్కడి అనిశ్చితిని స్పష్టంగా చూపిస్తోంది.

ఇదే సమయంలో అమెరికా వైపు నుంచి వచ్చిన సందేశం కూడా గమనించాల్సిందే. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇరాన్ మంచి ఒప్పందం చేసుకునే అవకాశం ఇంకా ఉందని చెప్పారు. అయితే అమెరికాకు ఎలాంటి ఆత్రుత లేదని, తమ వద్ద చాలాసమయం ఉందని కూడా వ్యాఖ్యానించారు. అంటే పైకి చర్చలకు తలుపు తెరిచి ఉంచినా ఒత్తిడి విధానం మాత్రం అలాగే కొనసాగుతోందని అర్థమవుతోంది. ఇదే ఈ మొత్తం పరిస్థితిలోని ప్రధాన విరుద్ధత. ఒకవైపు చర్చల ఆశ, మరోవైపు దిగ్బంధన ఒత్తిడి.

ఈ నేపథ్యంలో అరాఘ్చీ పర్యటన సాధారణ దౌత్య పర్యటన కాదు. ఇది చర్చలకు ముందు భాగస్వాములతో లైన్లు సెట్ చేసే ప్రయత్నం. పాకిస్థాన్‌తో సమన్వయం, ఒమాన్‌తో సంబంధం, రష్యాతో వ్యూహ చర్చలు అన్నీ కలిపి చూస్తే ఇరాన్ ఇప్పుడు చర్చల బల్లపై ఒంటరిగా కూర్చోవాలనుకోవడం లేదని అర్థమవుతోంది. అందుకే ఈ పర్యటన ఒక ప్రయాణం మాత్రమే కాదు, రెండో విడత చర్చలకు ముందు ఇరాన్ దౌత్య కదలికగా చూడాలి. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే. ఈ పర్యటన తర్వాత చర్చలు నిజంగా మొదలవుతాయా, లేక మరోసారి ఆలస్యం అవుతాయా.

ఆంధ్రప్రదేశ్