పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ చమురు సరఫరాపై పడుతున్న నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ ఇంధన అవసరాలను రక్షించుకునే దిశగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ ఊర్జా సురక్షా’ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ ద్వారా హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే చమురు, ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ నౌకలకు భారత నౌకాదళం భద్రత కల్పిస్తోంది.
సాధారణంగా భారత్‌కు వచ్చే ఇంధన నౌకలు సౌదీ అరేబియాలోని రాస్ తనురా వంటి పోర్టుల నుంచి బయలుదేరి పర్షియన్ గల్ఫ్ మీదుగా హర్మూజ్ జలసంధి చేరుకుంటాయి. అక్కడి నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమన్ మీదుగా అరేబియా సముద్రంలోకి ప్రవేశించి భారత తీరాలకు చేరుకుంటాయి. అయితే ప్రస్తుతం ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో హర్మూజ్ వద్ద వందలాది నౌకలు నిలిచిపోయాయి.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారత నేవీ రంగంలోకి దిగింది. హర్మూజ్ సమీపంలో యుద్ధ నౌకలను మోహరించి, నౌకలకు రక్షణ కల్పిస్తోంది. ఇరాన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నౌకలు సురక్షితంగా జలసంధిని దాటేలా సహకరిస్తోంది. హర్మూజ్ దాటిన తరువాత కూడా గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్ర ప్రాంతాల్లో నిఘా కొనసాగిస్తోంది.
ఇప్పటికే ‘పైన్ గ్యాస్’, ‘జగ్ వసంత్’ వంటి గ్యాస్ ట్యాంకర్లు భారత వైపు ప్రయాణం ప్రారంభించాయి. అంతకుముందు ‘శివాలిక్’, ‘నందాదేవి’ వంటి నౌకలు కూడా సురక్షితంగా భారత పోర్టులకు చేరుకున్నాయి. ప్రస్తుతం భారత్‌కు రావాల్సిన 22 నౌకలు తరలింపుకు సిద్ధంగా ఉండగా, వాటిలో ఎక్కువ శాతం ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ, క్రూడ్ ఆయిల్ రవాణా చేస్తున్నవే.
ఇదిలాఉండగా, హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు ఫీజులు విధించే అంశంపై కూడా గందరగోళం నెలకొంది. ఇరాన్ తొలుత ఈ వార్తలను ఖండించినప్పటికీ, ఇటీవల విదేశాంగ శాఖ ప్రతినిధి వ్యాఖ్యలు కొత్త సందేహాలకు తావిచ్చాయి. మరోవైపు, అమెరికా-ఇజ్రాయెల్‌కు సంబంధించిన నౌకలు మినహా మిగిలినవన్నీ హర్మూజ్ గుండా ప్రయాణించవచ్చని ఇరాన్ ప్రకటించడం పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో సూచిస్తోంది.
చమురు నౌకల రక్షణకు ‘ఆపరేషన్ ఊర్జా సురక్షా’ ప్రారంభించిన భారత్
4
Published on: 📅 25 Mar 2026, 02:45 PM
Reporter: 🖊 Sarika Sk