heated debate on musi project in assembly brs walkout

మూసీ ప్రాజెక్టుపై అసెంబ్లీలో హోరాహోరీ చర్చ.. బీఆర్‌ఎస్ వాకౌట్

14

Published on: 📅 18 Mar 2026, 03:18 PM
Reporter: 🖊 Ramesh Kumar

తెలంగాణ శాసనసభలో మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టుపై తీవ్ర చర్చలు జరిగాయి. మూడోరోజు సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా మూసీ ప్రాజెక్టుపై పలువురు సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్ తదితరులు ఈ ప్రాజెక్టు అవసరం, అమలు విధానంపై ప్రశ్నలు లేవనెత్తారు.

దీనికి స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి దశ డీపీఆర్ ఇప్పటికే సిద్ధమైందని తెలిపారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రారంభంలో రూ.6,500 కోట్లుగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం అది రూ.7,000 కోట్ల వరకు పెరిగిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు అమలు వల్ల సుమారు 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని వివరించారు. ఇంకా తుది ఎన్యుమరేషన్ కొనసాగుతోందని తెలిపారు.

బఫర్ జోన్‌లో ఉన్న ప్రజలకు టీడీఆర్ (ట్రాన్స్‌ఫర్ ఆఫ్ డెవలప్‌మెంట్ రైట్స్) ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూముల సేకరణ, పరిహారం, పునరావాస చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అయితే మంత్రి సమాధానంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డీపీఆర్ తయారీకి 18 నెలలు పడుతుందని ముందుగా చెప్పినా ఇప్పుడు పూర్తైందని చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. డీపీఆర్‌ను సభ ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.

అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చులపై కూడా కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో రూ.16వేల కోట్ల ప్రాజెక్టు అని చెప్పి, ఇప్పుడు రూ.లక్షన్నర కోట్ల వరకు వ్యయం ఉంటుందని సీఎం పేర్కొనడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నిర్మాణాల సంఖ్యపై కూడా స్పష్టత లేదని, మంత్రి 1,435 అన్నారు కానీ గెజిట్‌లో 10 వేల నిర్మాణాలు ఉన్నట్లు ఉందని పేర్కొన్నారు.

మూసీ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఇందులో జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.

ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ సభ్యులు ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళికలు, నిధులు లేవని ఆరోపించారు. ఏడీబీ రుణంపై కూడా స్పష్టత లేదని పేర్కొన్నారు.

ఈ పరిణామాలతో మూసీ ప్రాజెక్టు రాజకీయంగా మరింత వేడెక్కింది. రాబోయే రోజుల్లో ఈ అంశం మరింత చర్చకు దారి తీసే అవకాశం ఉంది.

Sponsored