పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన డ్రోన్ దాడి కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఒక డ్రోన్ విమానాశ్రయం సమీపంలోని ఇంధన నిల్వ ట్యాంక్‌ను ఢీకొట్టడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడడంతో వెంటనే భద్రతా చర్యలు చేపట్టిన అధికారులు విమానాశ్రయంలోని అన్ని విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకారం పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలను నిలిపివేశారు. విమానాశ్రయంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందికి భద్రతా హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణికులు తమ విమానాల స్టేటస్ గురించి తెలుసుకోవడానికి ఆయా విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.
ఈ ఘటన కారణంగా పలు అంతర్జాతీయ విమానాలను దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. మరోవైపు అగ్నిప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలు భద్రతా కారణాల దృష్ట్యా ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు.
ఇదిలా ఉండగా కొచ్చి నుంచి దుబాయ్ బయలుదేరిన ఎమిరేట్స్ విమానం కూడా మధ్యలోనే వెనక్కి మళ్లించబడింది. విమానాశ్రయం మూసివేసిన సమాచారం అందడంతో ఆ విమానాన్ని తిరిగి కొచ్చికి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో దుబాయ్ విమానాశ్రయ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
దుబాయ్ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడి.. విమానాల రాకపోకలు నిలిపివేత
12
Published on: 📅 16 Mar 2026, 10:31 AM
Reporter: 🖊 Ramesh Kumar