ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులపై ప్రభుత్వం మరింత దూకుడు పెంచుతోంది. శ్రీసిటీలో క్యారియర్ సంస్థ భారీ తయారీ కేంద్రానికి మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమ కోసం సంస్థ వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
శ్రీసిటీలో ఏర్పాటు కానున్న ఈ కేంద్రం దేశవ్యాప్తంగా కీలక తయారీ కేంద్రంగా మారనుంది. భారతదేశంలో క్యారియర్ ఉత్పత్తుల్లో 80 శాతం ఇక్కడి నుంచే సరఫరా చేయనున్నట్లు లోకేశ్ వెల్లడించారు. చిన్న సామర్థ్యం కలిగిన గృహ వినియోగ యంత్రాల నుంచి భారీ పారిశ్రామిక సముదాయాలకు అవసరమైన కూలింగ్ వ్యవస్థల వరకు తయారీ జరగనుంది. వెయ్యి టన్నుల నుంచి ఐదు వేల టన్నుల సామర్థ్యం కలిగిన వ్యవస్థలను కూడా ఇక్కడే తయారు చేయనున్నట్లు తెలిపారు.
ఈ పరిశ్రమ కోసం శ్రీసిటీ పరిధిలోని ఆరూరు ప్రాంతంలో 40 ఎకరాల భూమిని కేటాయించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోందని లోకేశ్ అన్నారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన సేవలను ఒక సందేశంతోనే అందించే విధంగా వ్యవస్థను తీసుకొస్తున్నామని చెప్పారు.
శ్రీసిటీలో ప్రస్తుతం 70 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వారిలో 35 వేల మంది మహిళలు ఉన్నారని లోకేశ్ పేర్కొన్నారు. దీనిని మహిళా శక్తికి నిదర్శనంగా అభివర్ణించారు. స్థానిక యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పరిశ్రమలకు సూచించారు.
ఈ నెలాఖరులోగా కృత్రిమ మేధ ఆధారంగా నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కూడా మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెరగడం ఒకవైపు ఉపాధిని పెంచుతుండగా, మరోవైపు స్థానిక ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తోంది. అయితే పెట్టుబడులు ప్రకటించడం కంటే వాటి అమలు వేగం, ఉద్యోగాల నిజమైన సృష్టి ఇప్పుడు కీలకంగా మారింది.
శ్రీ సిటీలో క్యారియర్ భారీ పెట్టుబడి 3000 ఉద్యోగాల సృష్టి
2
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan