పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికత ఉండేలా రాష్ట్రంలోని ఇద్దరు కీలక అధికారులను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నందిని చక్రవర్తిని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో ఐఏఎస్ అధికారి దుష్యంత్ నరియాలను కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
ఇదే సమయంలో రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి జగదీశ్ ప్రసాద్ మీనాపైనా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. ఆయనను కూడా ఎన్నికలకు సంబంధించిన బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆ స్థానంలో ఐఏఎస్ అధికారి సంఘమిత్ర ఘోష్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు నందిని చక్రవర్తి మరియు జగదీశ్ ప్రసాద్ మీనా ఎలాంటి పోలింగ్ సంబంధిత విధుల్లో పాల్గొనకూడదని ఈసీ స్పష్టం చేసింది.
ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. తమ ఆదేశాలు వెంటనే అమలులోకి రావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 23న, రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న నిర్వహించనున్నారు. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇదిలా ఉండగా ఓటర్ల జాబితా సవరణలు, ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషన్ మధ్య ఇటీవల తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈసీ తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
బెంగాల్ ఎన్నికల వేళ ఈసీ చర్యలు.. ఇద్దరు కీలక అధికారుల తొలగింపు
8
Published on: 📅 16 Mar 2026, 12:35 PM
Reporter: 🖊 Ramesh Kumar