strikesonirannuclearsitesraisetensions

ఇరాన్ అణుకేంద్రాలపై దాడులు.. ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి

10

Published on: 📅 30 Mar 2026, 01:00 AM
Reporter: 🖊 Eswar Pavan

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఇరాన్ ని రెండు కీలక అణుకేంద్రాలపై జరిగిన దాడులు అంతర్జాతీయంగా ఆందోళనకు దారితీశాయి. ముఖ్యంగా అరాక్‌లోని భారజల రియాక్టర్‌పై జరిగిన దాడి తీవ్ర ప్రభావం చూపినట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వెల్లడించింది.

IAEA ప్రకారం, ఈ దాడిలో భారజల ఉత్పత్తి కేంద్రం గణనీయంగా ధ్వంసమైంది. దీంతో ప్రస్తుతం అక్కడ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. అయితే అక్కడ అణుధార్మిక పదార్థాలు ఉన్నాయన్న అధికారిక సమాచారం లేనందున రేడియేషన్ ముప్పు లేదని స్పష్టం చేసింది.

మార్చి 27న జరిగిన ఈ దాడులను ఇరాన్ ధ్రువీకరించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేదని ప్రకటించింది. మరోవైపు ఈ దాడులకు బాధ్యత వహించింది తామేనని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.

ఇక ఉత్తర ఇరాన్‌లోని తబ్రిజ్ ప్రాంతంలోని పెట్రోకెమికల్ ప్లాంట్‌పైనా దాడి జరిగినట్లు సమాచారం. ఈ ప్లాంట్‌లో చమురు, గ్యాస్, ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారవుతాయి. దాడి కారణంగా ప్లాంట్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమపై కొనసాగుతున్న దాడులకు గట్టి ప్రతీకారం తీసుకుంటామని ప్రకటించింది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ కు చెందిన సైనిక కమాండర్లు, రాజకీయ నాయకులే లక్ష్యమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) హెచ్చరించింది.

మొత్తంగా ఈ దాడులు పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చాయి. అణుకేంద్రాలపై దాడులు జరగడం అంతర్జాతీయంగా కూడా ఆందోళన కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులు మరింత తీవ్రమవుతాయా లేదా దౌత్యపరమైన పరిష్కారం దొరుకుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Sponsored