22 crore women power mamatas didi model ahead of elections

2.2 కోట్ల మహిళలే బలం.. దీదీ మోడల్ మళ్లీ గెలుపేనా?

6

Published on: 📅 30 Mar 2026, 10:44 AM
Reporter: 🖊 Eswar Pavan

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ మరోసారి ‘దీదీ మోడల్’తో ముందుకు దూసుకెళ్తున్నారు. వరుసగా మూడు సార్లు అధికారంలో నిలిచిన ఆమె, ఇప్పుడు నాలుగోసారి గెలుపు కోసం సంక్షేమాన్ని ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ప్రజలతో నేరుగా అనుసంధానం, నగదు సాయం, ఆహార భద్రత వంటి అంశాలు ఆమె రాజకీయ బలం అయ్యాయి.

ఈ మోడల్‌లో కీలకంగా నిలిచింది లక్ష్మీర్ భండార్ పథకం. 2021లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా 25 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న 2.2 కోట్ల మహిళలకు నెలకు ₹1000 సాయం అందుతోంది. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ₹1200 ఇస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని ₹500 పెంచుతామని తృణమూల్ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇది మహిళల్లో భారీ మద్దతు తెచ్చుకుంది.

ఆహార భద్రతలో భాగంగా ఖాద్ సాథీ పథకం ద్వారా 9 కోట్ల మందికి కేజీకి ₹2 చొప్పున బియ్యం, గోధుమలు అందిస్తున్నారు. అలాగే స్వాస్థ్య సాథీ ద్వారా 2.5 కోట్ల కుటుంబాలకు ₹5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించారు. ఇప్పటివరకు కోటి మందికి పైగా చికిత్స పొందారు.

విద్య రంగంలో కన్యశ్రీ పథకం ద్వారా 13 నుంచి 18 ఏళ్ల బాలికలకు ఏడాదికి ₹1000, 18 తర్వాత చదువు కొనసాగిస్తే ₹25,000 ప్రోత్సాహం ఇస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటికే 7 కోట్ల మంది లబ్ధి పొందారు.

అదే సమయంలో నిరుద్యోగ యువతకు నెలకు ₹1500 సాయం అందించే కొత్త పథకాన్ని కూడా ప్రకటించారు. 21 నుంచి 40 ఏళ్ల వారికి ఈ సాయం ఇవ్వనున్నారు.

అయితే ఈ భారీ సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇవి కేవలం ఓటు రాజకీయాల కోసమేనని ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇప్పుడు ప్రశ్న ఒక్కటే — ఈ ‘దీదీ మోడల్’ మమతకు మరోసారి గెలుపు తెస్తుందా? రాబోయే ఎన్నికల్లో దీనిపై క్లారిటీ రానుంది.

Sponsored