chandrababu naidu unveils 58foot potti sriramulu statue in amaravati

అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ.. సీఎం చంద్రబాబు ఘనంగా ఆవిష్కరణ

7

Published on: 📅 16 Mar 2026, 12:55 PM
Reporter: 🖊 Suresh Reddy

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ 58 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన నేపథ్యంలో ఆ సంఖ్యకు గుర్తుగా ఈ విగ్రహాన్ని నిర్మించారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, టీజీ భరత్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తుళ్లూరు సమీపంలో 6.8 ఎకరాల విస్తీర్ణంలో స్మృతివనం నిర్మాణం జరుగుతోంది. ఈ స్మృతివనంలో భాగంగానే అమరజీవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆయన 125వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించారు.

ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, ట్రస్ట్ సభ్యులు కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఆయన స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని నేతలు పేర్కొన్నారు. అమరజీవి త్యాగాన్ని గుర్తుంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

Sponsored