rotten chicken seized in musheerabad police raid

కుళ్లిన చికెన్ విక్రయం.. ముషీరాబాద్‌లో షాపుపై పోలీసుల దాడి

6

Published on: 📅 18 Mar 2026, 09:06 AM
Reporter: 🖊 Ramesh Kumar

ముషీరాబాద్‌లోని బాపూజీనగర్ ప్రాంతంలో ఉన్న ఏ-1 ఫ్రెష్ చికెన్ మార్ట్‌పై వారాసిగూడ పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో సుమారు 610 కిలోల కుళ్లిపోయిన చికెన్ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమాని షేక్ షకీల్ పాడైన చికెన్‌ను విక్రయిస్తున్నాడన్న సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.


తనిఖీల్లో భాగంగా మాంసం నిల్వ ఉంచిన ప్రదేశం అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్లు బయటపడింది. మాంసం నుంచి దుర్వాసన వస్తుండడంతో పాటు, ఎలుకలు, పిల్లులు సంచరించే ప్రదేశంలో నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో మాంసం విక్రయించడం ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతుందని తెలిపారు.


మరోవైపు షాపు ట్రేడింగ్ లైసెన్స్ గడువు ముగిసి ఏడాది దాటినా దాన్ని పునరుద్ధరించకుండా అక్రమంగా వ్యాపారం కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.


ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా ఆహార పదార్థాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Sponsored