zaheer khan becomes coowner of antwerp anchors in belgium t20 league

యూరప్ క్రికెట్‌లో జహీర్ ఖాన్ ఎంట్రీ.. బెల్జియం టీమ్‌కు సహ యజమాని

4

Published on: 📅 18 Mar 2026, 12:18 PM
Reporter: 🖊 Ramesh Kumar

యూరప్ క్రికెట్ అభివృద్ధిలో కీలక ముందడుగుగా జహీర్ ఖాన్ కొత్త బాధ్యతలు స్వీకరించాడు. యూరోపియన్ టి20 బెల్జియం లీగ్లో పాల్గొనే ఆంట్వైర్ప్ యాంకర్స్ జట్టుకు సహ యజమానిగా చేరినట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఈ లీగ్ జూన్ 4 నుంచి 14 వరకు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరగనుంది.

జహీర్ ఖాన్ మాట్లాడుతూ యూరప్‌లో క్రికెట్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని, ఈ లీగ్ ఆ దిశగా ఒక ప్రారంభం మాత్రమేనని అభిప్రాయపడ్డాడు. ఆంట్వైర్ప్ యాంకర్స్‌తో భాగస్వామ్యం కేవలం వ్యాపార పరమైన నిర్ణయం కాదని, కొత్త ప్రతిభను గుర్తించి వారికి సరైన వేదిక కల్పించడమే తన లక్ష్యమని వెల్లడించాడు. యువ ఆటగాళ్లు తమ పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించేలా అవసరమైన మద్దతు అందించాలనే ఉద్దేశంతో ఈ బాధ్యతలు స్వీకరించినట్లు చెప్పాడు.

యూరోపియన్ క్రికెట్ విస్తరణలో భాగంగా ఈ లీగ్ నిర్వహణకు మంచి స్పందన లభిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. జహీర్ ఖాన్ లాంటి అనుభవజ్ఞుడు జట్టుతో కలవడం ఫ్రాంచైజీకి పెద్ద బలంగా మారనుంది.

ఇక ఆంట్వైర్ప్ యాంకర్స్ యజమాని నాగేంద్ర సిద్దౌతమ్ మాట్లాడుతూ జహీర్ ఖాన్ చేరిక ఫ్రాంచైజీ లక్ష్యాలను ప్రతిబింబిస్తుందని అన్నారు. అతడు క్రికెట్‌లో ఒక లెజెండ్, విజేత అని పేర్కొన్నారు. అతడి అనుభవం యూరప్ క్రికెట్ అభివృద్ధికి తోడ్పడుతుందని, భవిష్యత్తులో ఈ లీగ్ మరింత విస్తరించే అవకాశాలున్నాయని తెలిపారు.

Sponsored