sarke chunar song from kd the devil sparks controversy

‘సర్కే చునర్‌’ పాటపై వివాదం.. కేడీ మూవీపై విమర్శలు

5

Published on: 📅 18 Mar 2026, 09:07 AM
Reporter: 🖊 Suresh Reddy

పాన్ ఇండియా చిత్రం ‘కేడీ: ది డెవిల్‌’లోని ‘సర్కే చునర్‌ తేరీ సర్కే’ పాట ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. ధ్రువ్ సర్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో నోరా ఫతేహి, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ పాటలోని సాహిత్యం, నృత్యాలు అసభ్యంగా ఉన్నాయని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


ఈ పాట విడుదలైన వెంటనే సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోలింగ్‌కు గురైంది. ముఖ్యంగా మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఈ అంశాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లింది.


దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అధికారులను అప్రమత్తం చేసింది. ఈ పాటను అన్ని వేదికల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే భవిష్యత్తులో సినిమాలు, మ్యూజిక్ వీడియోల్లో ఇలాంటి అసభ్యకర కంటెంట్ పునరావృతం కాకుండా కఠినంగా పర్యవేక్షించాలని ఆదేశించింది.


‘కేడీ: ది డెవిల్‌’ చిత్రాన్ని ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ నిర్మించారు. రీష్మా కథానాయికగా నటించారు. సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ యాక్షన్ హంగులతో రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ వివాదం సినిమాపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.

Sponsored