దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఇళ్లు, దుకాణాలను దీపాలతో అలంకరించి, భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవి పూజలు చేశారు. చిన్న పెద్ద అంతా కలిసి బాణసంచా కాల్చుతూ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బేగంపేట దివ్యాంగ పాఠశాలలో విద్యార్థులతో కలిసి వేడుకలు చేసుకున్నారు. వారికి మిఠాయిలు పంచిపెట్టారు. హుస్నాబాద్ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కార్యకర్తలతో కలిసి దీపావళి సంబరాలు చేసుకున్నారు.