ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ పండితుడు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ, ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మన జీవితంలోని కష్టసుఖాలను ప్రతిబింబిస్తాయని తెలిపారు. మన జీవితంలో ఆనందం, బాధలు, విజయాలు, అపజయాలు అన్నీ కలిసే ఉంటాయని, వాటిని సమతుల్యంగా స్వీకరించాలన్నారు. పండుగలు మనకు కేవలం ఆనందాన్ని మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని కూడా నేర్పిస్తాయని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ కొత్త సంవత్సరం అందరికీ శుభఫలితాలు అందించాలని ఆకాంక్షించారు. సంపద కొందరికే పరిమితం కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరాలని సీఎం అభిప్రాయపడ్డారు. విలువలు కాపాడుకోవడం ద్వారా మాత్రమే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధిపై కూడా సీఎం ప్రస్తావించారు. అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకున్నామని తెలిపారు. గతంలో కొన్ని కారణాల వల్ల ప్రజలు పండుగలు సంతోషంగా జరుపుకోలేని పరిస్థితి ఏర్పడిందని, ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోందన్నారు. భయం, విధ్వంసం కాకుండా అభివృద్ధి, శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
నీటి భద్రత, ప్రకృతి పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. రాష్ట్రంలోని జలాశయాలు నిండి కళకళలాడుతున్నాయని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోదావరి పుష్కరాలు మూడోసారి నిర్వహించామని, త్వరలో కృష్ణా పుష్కరాలను కూడా అదే విధంగా నిర్వహించనున్నామని వెల్లడించారు.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఉగాది పురస్కారాలు అందజేశారు. మొత్తం 38 మందికి కళారత్న పురస్కారాలు, 122 మందికి ఇతర అవార్డులు ప్రదానం చేశారు.
అలాగే ఉగాది రోజు తొలి సంతకంగా ముఖ్యమంత్రి సీఎంఆర్ఎఫ్ ఫైల్‌పై సంతకం చేశారు. ఈ ఫైల్ ద్వారా 6,787 మందికి రూ.55.63 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఉగాది వేడుకల్లో సీఎం సందేశం.. జీవితంలో కష్టసుఖాల ప్రాధాన్యం
13
Published on: 📅 19 Mar 2026, 12:17 PM
Reporter: 🖊 Kiran Rao