ఎడారి దేశంగా గుర్తింపు పొందిన సౌదీ అరేబియానే ఇప్పుడు వరదల దెబ్బతో అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలు, ధూళి తుఫానుల కలయికతో రాజధాని రియాద్‌లో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. రోడ్లు చెరువులను తలపించాయి. పలు కీలక ప్రాంతాల్లో జనజీవనం తీవ్రంగా దెబ్బతింది. సాధారణంగా ఎండలు, ఇసుక తుఫానుల వార్తల్లో ఉండే దేశం ఇప్పుడు వరదలతో హై అలర్ట్‌కు వెళ్లడం అక్కడి పరిస్థితి ఎంత తీవ్రమైందో చూపిస్తోంది.
నివేదికల ప్రకారం గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రియాద్‌లో ప్రధాన రహదారులు నీటమునిగాయి. వాహనదారులు రోడ్లపై సరిగా ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది. ధూళి తుఫానులు కూడా తోడు కావడంతో విజిబిలిటీ తగ్గి ప్రయాణం మరింత కష్టమైంది. అల్ అహ్సా ప్రావిన్స్‌లో రహదారులు పూర్తిగా జలమయం కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించినట్లు సమాచారం.
పరిస్థితి తీవ్రంగా మారడంతో ప్రభుత్వం విద్యాసంస్థల భద్రతను ముందుంచింది. పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. అత్యవసర సేవల విభాగాలను హై అలర్ట్‌లో ఉంచింది. ఇది సాధారణ వర్షాల పరిస్థితి కాదని, పరిపాలన యంత్రాంగం దానిని ప్రమాద స్థాయిలో తీసుకుంటోందనే సంకేతం. ప్రజల భద్రత, రాకపోకలు, సేవల నిర్వహణ అన్నీ ఇప్పుడు ఒకే సమయంలో సవాల్‌గా మారాయి.
సౌదీ రెడ్ క్రిసెంట్ అథారిటీ కూడా పెద్ద ఎత్తున సిద్ధమైంది. రియాద్‌లో 143 అంబులెన్స్ యూనిట్లు, 25 ర్యాపిడ్ ఫోర్స్ బృందాలను రెడీగా ఉంచారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రత్యేక సహాయక చర్యలు చేపడుతున్నారు. హాట్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసి అత్యవసర స్పందన వ్యవస్థను యాక్టివ్‌లో పెట్టారు.
ఇటీవల ప్రాంతీయ ఉద్రిక్తతలు కాస్త తగ్గుతున్నాయనే భావన నెలకొన్న సమయంలోనే ప్రకృతి మరో సవాలు విసిరింది. ఇప్పుడు సౌదీ ముందున్న అసలు పరీక్ష ప్రజలను సురక్షితంగా కాపాడటం, సేవలను త్వరగా పునరుద్ధరించడం, వరద నష్టాన్ని నియంత్రించడం. ఈ వరదలు అక్కడి వ్యవస్థకు నేరుగా హెచ్చరికగా మారాయి.
సౌదీని ముంచిన వరదలు 143 అంబులెన్స్లు అలర్ట్
9
Published on: 📅 13 Apr 2026, 12:01 PM
Reported by: 🖊
Eswar Pavan