తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనతో పెద్ద గందరగోళం నెలకొంది. అక్రమ మైనింగ్ అంశాన్ని కేంద్రంగా చేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై సభా సంఘం వేయాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించడంతో సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఈ వ్యవహారంలో పెద్ద సంఖ్యలో సభ్యులపై ఒకేసారి చర్య తీసుకోవడం హైలైట్‌గా మారింది. మొత్తం 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను మండలి నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో మధుసూదనాచారి, రవీందర్రావు, దేశపతి శ్రీనివాస్, ఎల్ రమణ, యాదవరెడ్డి, సుంకరి రాజు, నవీన్‌కుమార్‌రెడ్డి, మధుసూదన్, వాణీదేవి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎం. కోటిరెడ్డి ఉన్నారు.
ఇదే సమయంలో ప్రభుత్వం వైపు నుంచి మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. ఈ అంశంపై ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లు, సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో స్పష్టం చేశారని తెలిపారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని బీఆర్ఎస్ సభ్యులను కోరారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా పెద్దల సభ గౌరవాన్ని కాపాడాలని పదే పదే విజ్ఞప్తి చేశారు.
కానీ బీఆర్ఎస్ సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఆందోళన కొనసాగుతుండటంతో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. వారిని సస్పెండ్ చేయాలని మంత్రి తీర్మానం ప్రవేశపెట్టగా, ఛైర్మన్ ఆమోదం తెలిపారు. దీంతో సభలో ప్రతిపక్ష ఆగ్రహం మరింత పెరిగింది.
ఈ పరిణామం ఇప్పుడు కేవలం సభా ఘటనగా మాత్రమే మిగలడం లేదు. అక్రమ మైనింగ్ అంశం, సీఐడీ విచారణ, మంత్రి రాజీనామా డిమాండ్, సభ్యుల సస్పెన్షన్ అన్నీ కలిసి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోంది.
ఇక ముందు ఈ కేసులో సీఐడీ విచారణ ఏం చెబుతుంది, బీఆర్ఎస్ ఈ అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది అన్నది కీలకం. మండలిలో జరిగిన ఈ రచ్చ రాబోయే రోజుల్లో మరింత పెద్ద రాజకీయ పోరుగా మారే ఛాన్స్ ఉంది.
11 మంది సస్పెండ్.. మండలిలో బీఆర్ఎస్ రచ్చ!
9
Published on: 📅 30 Mar 2026, 11:57 AM
Reporter: 🖊 Venkat Bhanu