ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు అనిత, జనార్దన్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ సీఎంకు వివరించారు. అధికారుల నివేదిక ప్రకారం ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 13 మంది మృతి చెందగా, 22 మంది గాయపడినట్లు తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనలో ప్రమాదానికి గురైన బస్సు హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. ఈ బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి బయల్దేరి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్‌ను విచారించగా స్టీరింగ్ స్ట్రక్ అయినట్లు చెప్పినట్లు సమాచారం. వాహనం నియంత్రణ తప్పడంతో టిప్పర్‌ను ఢీకొని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలని అధికారులకు సూచించారు. ప్రమాదానికి గల అసలు కారణాలను సమగ్రంగా విచారించి నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించారు.
ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి బయల్దేరిన నేపథ్యంలో ప్రయాణికుల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ సీఎస్ రామకృష్ణారావుకు ఆదేశాలు ఇచ్చి, ఆంధ్రప్రదేశ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఈ ప్రమాదం రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరాన్ని మరోసారి స్పష్టంచేసింది. బాధితులకు సహాయం అందించడం, ప్రయాణికుల వివరాలను ఖచ్చితంగా గుర్తించడం, ప్రమాదానికి గల కారణాలను వెలికితీయడం వంటి అంశాలపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
మార్కాపురం ప్రమాదంపై సీఎం సమీక్ష.. బాధితులకు సహాయం ఆదేశం
9
Published on: 📅 26 Mar 2026, 11:58 AM
Reporter: 🖊 Sarika Sk