ఎయిరిండియా సంస్థలో ఉద్యోగులకు ఇచ్చే ఉచిత విమాన టికెట్ల దుర్వినియోగం పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చింది. ఎంప్లాయీ లీజర్ ట్రావెల్ పథకం కింద ఉద్యోగులు తమ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి వంటి కుటుంబ సభ్యులతో ఉచితంగా ప్రయాణించేందుకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 14 టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ సదుపాయాన్ని కొందరు సిబ్బంది దుర్వినియోగం చేసినట్లు సంస్థ అంతర్గత పరిశీలనలో బయటపడింది.
ఎయిరిండియాలో సుమారు 24 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వారిలో 4,000 మందికి పైగా సిబ్బంది ఈ ఉచిత టికెట్లను తప్పుగా వినియోగించినట్లు గుర్తించారు. సంబంధం లేని వ్యక్తులను కూడా కుటుంబ సభ్యులుగా చూపించి ఉచిత టికెట్లపై ప్రయాణించేటట్లు చేసినట్లు సంస్థ నిర్ధారించింది. అంతేకాకుండా కొందరు ఉద్యోగులు ఈ టికెట్లను ఇతరులకు అధిక ధరకు విక్రయించినట్లు కూడా విచారణలో తేలినట్లు సమాచారం.
గత ఆర్థిక సంవత్సరంలో ఈ దుర్వినియోగం ఎక్కువగా జరిగినట్లు సంస్థ తెలిపింది. ఈ వ్యవహారంలో మోసాలకు పాల్పడిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఎయిరిండియా సిద్ధమవుతోంది. మోసపూరితంగా పొందిన ప్రయోజనాలను తిరిగి వసూలు చేయడంతో పాటు సంబంధిత సిబ్బందిపై జరిమానాలు విధించే అవకాశముందని వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో మార్పులు చేసింది. ఇరాన్, ఇరాక్ గగనతలాన్ని వినియోగించలేకపోవడంతో విమానాలను ఈజిప్ట్ మార్గం ద్వారా మళ్లిస్తోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా డీజీసీఏ అంతర్జాతీయ విమాన సిబ్బందికి పనివేళల నిబంధనల నుంచి తాత్కాలికంగా ఏప్రిల్ 30 వరకు మినహాయింపు ఇచ్చింది.
ఎయిరిండియాలో ఉచిత టికెట్ల దుర్వినియోగం.. 4 వేల మంది సిబ్బందిపై చర్యలు
8
Published on: 📅 16 Mar 2026, 10:41 AM
Reporter: 🖊 Anitha Sharma