హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల పాలనలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అస్వస్థంగా తయారైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. సెప్టెంబరు 2025 నెలలో జీఎస్టీ వసూళ్ల వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే అట్టడుగున ఉండటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయం నుండి ఐటీ వరకు అన్ని రంగాలకు దన్ను ఇవ్వడంతో ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసిందని గుర్తుచేశారు. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో పండగ సమయంలోనూ అన్ని రంగాలు నేలచూపులే చూస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందనడానికి ఇది స్పష్టమైన సూచిక అని హెచ్చరించారు.