teen sensation kimi antonelli wins chinese grand prix

19 ఏళ్ల కిమి ఆంటోనెలి సంచలనం.. చైనీస్ గ్రాండ్ ప్రి విజేత

10

Published on: 📅 16 Mar 2026, 08:30 AM
Reporter: 🖊 Kiran Rao

ఫార్ములావన్ ప్రపంచంలో కొత్త సంచలనం కిమి ఆంటోనెలి. ఇటలీకి చెందిన ఈ 19 ఏళ్ల యువ డ్రైవర్ చైనీస్ గ్రాండ్ ప్రి టైటిల్ గెలుచుకుని ఎఫ్-1 చరిత్రలో రెండో చిన్న వయస్కుడైన విజేతగా నిలిచాడు. మాక్స్ వెర్‌స్టాపెన్, లూయిస్ హామిల్టన్, లాండో నోరిస్, ఆస్కార్ పియాస్ట్రి వంటి అనుభవజ్ఞుల మధ్య పోటీ ఉన్నప్పటికీ కిమి తన మెరుపు వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

కిమి ఆంటోనెలికి రేసింగ్ పట్ల ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉంది. అతడి తండ్రి మార్కో ఆంటోనెలి కూడా ప్రముఖ రేసర్. 1990లలో ఇటలీ తరఫున అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. తన అనుభవాన్ని ఉపయోగించుకుంటూ 1993లో ఆంటోనెలి మోటర్‌స్పోర్ట్ పేరుతో ఒక రేసింగ్ టీమ్‌ను ప్రారంభించాడు. ఈ వాతావరణంలో పెరిగిన కిమి ఏడేళ్ల వయసులోనే రేసింగ్ ట్రాక్‌పై అడుగుపెట్టాడు. తండ్రి శిక్షణలో అతడు వేగంగా ఎదిగి చిన్న వయసులోనే కార్టింగ్ పోటీల్లో సత్తా చాటాడు.

2014లో అంతర్జాతీయ రేసింగ్‌లో అడుగుపెట్టిన కిమి, 2015లో ఈజీకార్ట్ అంతర్జాతీయ టైటిల్‌ను గెలుచుకున్నాడు. తరువాత కార్టింగ్ నుంచి ఫార్ములా రేసులకు వచ్చిన అతడు ఫార్ములా-2లో మెర్సిడెజ్ తరఫున 2024లో బ్రిటన్, హంగేరి గ్రాండ్ ప్రిలను గెలుచుకున్నాడు. గత ఏడాది ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రి ద్వారా ఫార్ములావన్‌లో అరంగేట్రం చేసిన కిమి, ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ ఫెరారీకి వెళ్లిన తర్వాత ఖాళీ అయిన స్థానంలో మెర్సిడెజ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఈ సీజన్‌లో ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిలో రెండో స్థానంలో నిలిచిన అతడు చైనీస్ గ్రాండ్ ప్రిలో పోల్ పొజిషన్ సాధించి చివరకు విజేతగా నిలిచాడు. మెరుపు వేగం, స్థిరత్వం, ధైర్యమైన డ్రైవింగ్‌తో కిమి భవిష్యత్తులో ఫార్ములావన్‌లో మరో సూపర్ స్టార్‌గా ఎదగనున్నాడని నిపుణులు భావిస్తున్నారు.

Sponsored