పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఇరాన్ ని రెండు కీలక అణుకేంద్రాలపై జరిగిన దాడులు అంతర్జాతీయంగా ఆందోళనకు దారితీశాయి. ముఖ్యంగా అరాక్‌లోని భారజల రియాక్టర్‌పై జరిగిన దాడి తీవ్ర ప్రభావం చూపినట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వెల్లడించింది.
IAEA ప్రకారం, ఈ దాడిలో భారజల ఉత్పత్తి కేంద్రం గణనీయంగా ధ్వంసమైంది. దీంతో ప్రస్తుతం అక్కడ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. అయితే అక్కడ అణుధార్మిక పదార్థాలు ఉన్నాయన్న అధికారిక సమాచారం లేనందున రేడియేషన్ ముప్పు లేదని స్పష్టం చేసింది.
మార్చి 27న జరిగిన ఈ దాడులను ఇరాన్ ధ్రువీకరించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేదని ప్రకటించింది. మరోవైపు ఈ దాడులకు బాధ్యత వహించింది తామేనని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
ఇక ఉత్తర ఇరాన్‌లోని తబ్రిజ్ ప్రాంతంలోని పెట్రోకెమికల్ ప్లాంట్‌పైనా దాడి జరిగినట్లు సమాచారం. ఈ ప్లాంట్‌లో చమురు, గ్యాస్, ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారవుతాయి. దాడి కారణంగా ప్లాంట్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమపై కొనసాగుతున్న దాడులకు గట్టి ప్రతీకారం తీసుకుంటామని ప్రకటించింది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ కు చెందిన సైనిక కమాండర్లు, రాజకీయ నాయకులే లక్ష్యమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) హెచ్చరించింది.
మొత్తంగా ఈ దాడులు పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చాయి. అణుకేంద్రాలపై దాడులు జరగడం అంతర్జాతీయంగా కూడా ఆందోళన కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులు మరింత తీవ్రమవుతాయా లేదా దౌత్యపరమైన పరిష్కారం దొరుకుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇరాన్ అణుకేంద్రాలపై దాడులు.. ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి
10
Published on: 📅 30 Mar 2026, 01:00 AM
Reporter: 🖊 Eswar Pavan