sangameswara temple reemerges as water levels recede

నదీ జలాల నుంచి బయటపడుతున్న సంగమేశ్వర ఆలయం

11

Published on: 📅 16 Mar 2026, 10:05 AM
Reporter: 🖊 Suresh Reddy

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో ఉన్న చారిత్రాత్మక సంగమేశ్వర ఆలయం మళ్లీ భక్తులకు దర్శనమివ్వబోతోంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో నదీ జలాల్లో మునిగిపోయిన ఈ ఆలయం క్రమంగా బయటపడుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయ నీటిమట్టం 843.70 అడుగులకు చేరుకోవడంతో ఆలయ ప్రహరీ భాగం కిందివరకు నీరు తగ్గిపోయింది. దీంతో ఆలయ ముఖద్వారం స్పష్టంగా కనిపించడం ప్రారంభమైంది.

ఈ ఆలయం ప్రతి సంవత్సరం కొంతకాలం నీటిలో మునిగిపోతూ, మళ్లీ బయటపడుతూ ఉండటం ప్రత్యేకత. నీటిమట్టం పూర్తిగా తగ్గినప్పుడు భక్తులు సంగమేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం పొందుతారు. అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపిన వివరాల ప్రకారం ఇంకా సుమారు ఐదు అడుగులు నీటిమట్టం తగ్గితే ఆలయం పూర్తిగా బయటపడుతుంది. అప్పుడు ఆలయంలోని వేపాదారు శివలింగాన్ని భక్తులు ప్రత్యక్షంగా దర్శించుకునే అవకాశం ఉంటుంది.

సంగమేశ్వర ఆలయం చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు ఈ ఆలయం సాధారణంగా భక్తులకు అందుబాటులో ఉండేది. అయితే జలాశయం నిర్మాణం తర్వాత ఇది కొంతకాలం నీటిలో మునిగిపోతూ ఉంటుంది. నీరు తగ్గిన సమయంలో మాత్రం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుంటారు.

ఈసారి కూడా నీటిమట్టం తగ్గుతుండటంతో భక్తుల్లో ఆసక్తి పెరిగింది. ఆలయం పూర్తిగా బయటపడిన వెంటనే ప్రత్యేక పూజలు, దర్శన ఏర్పాట్లు చేయనున్నట్లు అర్చకులు తెలిపారు.

Sponsored