rare tie at oscars two winners in same category

ఆస్కార్ వేదికపై అరుదైన ఘటన.. ఒకే కేటగిరీలో ఇద్దరు విజేతలు

12

Published on: 📅 16 Mar 2026, 09:32 AM
Reporter: 🖊 Suresh Reddy

ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డులలో ఒకటైన ఆస్కార్ వేడుకలో ఈసారి అరుదైన సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ఒక కేటగిరీలో ఒక్క సినిమాకే అవార్డు లభిస్తుంది. అయితే ఈసారి బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో రెండు సినిమాలు సమానంగా ఓట్లు పొందడంతో ఇద్దరు విజేతలను ప్రకటించారు.

ప్రజెంటర్‌గా ఉన్న నటుడు కుమాయిల్ నంజియాని విజేత పేరును ప్రకటించే సమయంలో ఎన్వలప్ తెరిచి కొద్ది క్షణాలు మౌనంగా నిలిచాడు. దీంతో వేదికపై ఉన్నవారితో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. అనంతరం ఈ కేటగిరీలో టై వచ్చింది అని ప్రకటించడంతో డాల్బీ థియేటర్ చప్పట్లతో మారుమోగింది.

ఈ విభాగంలో ది సింగర్స్ మరియు టూ పీపుల్ ఎక్ఛ్సేంజ్ సలైవా చిత్రాలు సమాన ఓట్లు సాధించి అవార్డును పంచుకున్నాయి. అవార్డును ప్రకటించే సమయంలో నంజియాని సరదాగా మాట్లాడుతూ ఒక షార్ట్ ఫిల్మ్ అవార్డు ఇవ్వడానికి రెట్టింపు సమయం పడుతోంది అని వ్యాఖ్యానించాడు.

ఇక ఈ వేడుకకు హోస్ట్‌గా ఉన్న కోనన్ ఓబ్రియన్ కూడా ఈ సందర్భాన్ని సరదాగా తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డులపై బెట్టింగ్ వేసిన వారికి ఈ టై పెద్ద షాక్ అయి ఉండొచ్చని ఆయన జోక్ చేశారు.

ఇప్పటివరకు 98 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఈ విధంగా ఒకే కేటగిరీలో ఇద్దరు విజేతలు నిలవడం ఇది ఏడోసారి మాత్రమే. అందుకే ఈ సంఘటన ఆస్కార్ చరిత్రలో మరో అరుదైన క్షణంగా నిలిచింది.

Sponsored