ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన మొజ్తాబా ఖమేనీపై అంతర్జాతీయ స్థాయిలో పలు కథనాలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవల అమెరికా దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, చికిత్స కోసం రష్యా రాజధాని మాస్కోకు తరలించారని వార్తలు వెలువడ్డాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా ఆహ్వానించారనే కథనాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి.
అయితే ఈ వార్తలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. రష్యాలోని ఇరాన్ రాయబారి కాజెమ్ జలాలీ ఈ కథనాలను పూర్తిగా తప్పుబట్టారు. ఇలాంటి ప్రచారాలు కొత్త తరహా మానసిక యుద్ధం భాగమని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ నాయకులు ఎక్కడికీ పారిపోరని, షెల్టర్లలో దాక్కోరని, ప్రజల మధ్యే ఉంటారని స్పష్టం చేశారు.
ఇక మరోవైపు, ఈ వ్యవహారంపై స్పందించేందుకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ నిరాకరించారు. దీంతో ఈ వార్తలపై మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మొజ్తాబా ఖమేనీ పరిస్థితిపై సందేహాలు వ్యక్తం చేశారు. ఆయన బతికే ఉన్నారా లేదా అన్నది స్పష్టంగా తెలియదని పేర్కొన్నారు. అలాగే అమెరికా రక్షణ మంత్రి కూడా ఆయన తీవ్రంగా గాయపడ్డారని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపించలేదు.
ఇరాన్ మాత్రం ఈ వాదనలను పూర్తిగా ఖండిస్తూ, ఇవి అసత్య ప్రచారమని స్పష్టం చేస్తోంది. ఈ పరిణామాలు మధ్యప్రాచ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.