defamation suit filed over false claims linked to epstein files

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వివాదం.. తప్పుడు ప్రచారంపై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

9

Published on: 📅 16 Mar 2026, 05:18 PM
Reporter: 🖊 Suresh Reddy

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం భారతదేశంలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ కుమార్తెపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఎప్‌స్టీన్ లేదా అతడి నెట్‌వర్క్‌తో తనకు సంబంధం ఉందంటూ కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తులపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేసినట్లు ఆమె వెల్లడించారు. గత నెల 22 నుంచి గుర్తుతెలియని వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా తనను లక్ష్యంగా చేసుకుని అసత్య సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని దిల్లీ హైకోర్టుకు తెలియజేశారు. ఈ ప్రచారం తన ప్రతిష్ఠకు నష్టం కలిగిస్తోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును కోరారు.

ఎప్‌స్టీన్ నిర్వహించిన సెక్స్ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి నెట్‌వర్క్‌కు సంబంధం ఉందంటూ పలు ప్రముఖుల పేర్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఇదే సమయంలో తన పేరును కూడా ఈ వ్యవహారంలో లాగుతున్నారని ఆమె పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా గతంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఎప్‌స్టీన్‌ను కలిశారంటూ కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలపై స్పందించిన మంత్రి అప్పటికే వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ శాంతి సంస్థ ఐపీఐ కార్యక్రమాల్లో మాత్రమే ఎప్‌స్టీన్‌ను కలిసినట్లు, ఆ పరిచయం తప్ప మరే సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

Sponsored