టాటా గ్రూప్‌కు చెందిన ఎయిరిండియాలో కీలక మార్పు చోటుచేసుకుంది. సంస్థ సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా చేసినట్లు రాయిటర్స్ ఒక ప్రత్యక్ష వర్గాన్ని ఉటంకిస్తూ తెలిపింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా అదే అంశాన్ని నివేదిస్తూ, ఆయన 2022 జులై నుంచి సంస్థకు నాయకత్వం వహించినట్టు పేర్కొంది. ఆయన అసలు పదవీకాలం 2027 వరకు ఉండాల్సి ఉన్నా, ముందుగానే తప్పుకోవడం ఇప్పుడు విమానయాన రంగంలో పెద్ద చర్చగా మారింది. ఎయిరిండియా నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
విల్సన్ హయాంలో ఎయిరిండియా పునర్వ్యవస్థీకరణలో కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకుంది. ఇంజినీరింగ్ విభాగం ఓవర్‌హాల్, విమానాల రీఫర్బిష్‌మెంట్, విస్తారా విలీనం వంటి మార్పులు ఆయన కాలంలోనే జరిగాయి. కానీ అదే సమయంలో సంస్థ నిరంతర ఆర్థిక ఒత్తిడి, విమానాల డెలివరీ ఆలస్యాలు, భద్రతా లోపాలపై నియంత్రణ సంస్థల హెచ్చరికలు, గత ఏడాది జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత పెరిగిన పరిశీలన Air Indiaపై భారంగా మారాయి. రాయిటర్స్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియా మరియు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కలిపి ₹98.08 బిలియన్ నష్టాన్ని నమోదు చేశాయి.
ఇక్కడ అసలు ప్రశ్న రాజీనామా వార్త కంటే తర్వాత ఏమవుతుందన్నదే. రాయిటర్స్ జనవరిలోనే టాటా గ్రూప్ కొత్త సీఈఓ కోసం అన్వేషణ మొదలుపెట్టిందని తెలిపింది. ఇప్పుడు విల్సన్ ఆరు నెలల నోటీసు పీరియడ్‌లో కొనసాగుతూ, వారసుడు ఎంపికయ్యే వరకు బాధ్యతలు చూసే అవకాశం ఉందని అదే కథనం చెబుతోంది. ఇండిగోలో ఇటీవలే విల్లీ వాల్ష్ లాంటి పెద్ద పేరు ఎంపిక కావడంతో, ఎయిరిండియాపై సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన ఒత్తిడి మరింత పెరిగింది. ఎయిరిండియా తర్వాతి సీఈఓ ఎవరు అన్నదే ఇప్పుడు అసలు ఫోకస్.
ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా
9
Published on: 📅 07 Apr 2026, 10:39 AM
Reported by: 🖊
Eswar Pavan