కేడీ ది డెవిల్ సినిమాలోని సర్కే చునార్ తేరీ సర్కే పాటపై మొదలైన వివాదం ఇప్పుడు నేరుగా జాతీయ మహిళా కమిషన్ దాకా చేరింది. ఈ పాటలోని సాహిత్యం మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉందన్న ఆరోపణలతో కమిషన్ ఇప్పటికే సుమోటోగా విచారణ ప్రారంభించింది. మార్చి 19న నోరా ఫతేహి, సంజయ్ దత్, దర్శకుడు ప్రేమ్, నిర్మాతలు, ఇతర సంబంధిత వ్యక్తులకు సమన్లు జారీ చేయగా, ఏప్రిల్ 6న ఈ వ్యవహారంపై మళ్లీ విచారణ జరిగింది.
అయితే ఈ విచారణలో ప్రధాన మలుపు నోరా ఫతేహి హాజరు విషయంలో వచ్చింది. ఆమె వ్యక్తిగతంగా రాకుండా తరఫు న్యాయవాదిని పంపించడాన్ని కమిషన్ అంగీకరించలేదు. దీంతో ఆమెకు వ్యక్తిగత హాజరు కోసం చివరి అవకాశం ఇస్తూ ఏప్రిల్ 27 తేదీని నిర్ణయించింది. సంజయ్ దత్ కూడా విదేశాల్లో ఉన్నానని చెప్పినప్పటికీ, ఆయన తప్పనిసరిగా ఏప్రిల్ 8న హాజరుకావాలని కమిషన్ స్పష్టం చేసింది. ఈ చర్యతో కేసు కేవలం పాటపై వచ్చిన సోషల్ మీడియా విమర్శల దశను దాటి అధికారిక విచారణ స్థాయికి వెళ్లింది.
కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహాత్కర్ స్పష్టంగా ఒక విషయం చెప్పారు. సృజనాత్మకత పేరుతో మహిళల గౌరవాన్ని దెబ్బతీయడం సమర్థించలేమని, పాట పదాల అర్థం తెలియదని చెప్పడం సరైన సాకుకాదని హెచ్చరించారు. ఇదే సమయంలో గేయరచయిత రకీబ్ ఆలం, దర్శకుడు ప్రేమ్, కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రతినిధులు విచారణకు హాజరై లిఖితపూర్వక క్షమాపణ చెప్పారు. పాట సామాజికంగా ప్రతికూల ప్రభావం చూపిందని అంగీకరించినట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి.
వివాదం పెరగడంతో సర్కే చునార్ పాటను యూట్యూబ్ మరియు ఇతర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌ల నుంచి తొలగించారు. దర్శకుడు ప్రేమ్ మాత్రం ఇది వినోదం కోసం తీసిన పాట మాత్రమేనని, ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదని ఇప్పటికే వివరణ ఇచ్చారు. ధ్రువ్ సర్జా హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతోంది. కానీ ఇప్పుడు అసలు ఫోకస్ సినిమా ప్రమోషన్‌పై కాదు, కమిషన్ ముందు నోరా ఫతేహి మరియు సంజయ్ దత్ హాజరు ఎలా ఉండబోతోందన్నదిపై పడింది.
కేడీ పాట వివాదంపై నోరా ఫతేహికి చివరి అవకాశం
9
Published on: 📅 07 Apr 2026, 09:16 AM
Reported by: 🖊
Eswar Pavan