తెలంగాణలో ఈ నెల 15వ తేదీ నుంచి వృత్తి విద్యా కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల ఫెడరేషన్ సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మా, నర్సింగ్ కాలేజీలు ఈ బంద్‌లో పాల్గొననున్నట్లు ఫెడరేషన్ నేతలు వెల్లడించారు. గత కొంత కాలంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల ఫెడరేషన్ పేర్కొంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు రాకపోవడంతో.. తమ కాలేజీల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని వాపోయారు.