ఇరాన్‌పై యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికా రక్షణ వ్యవస్థలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా రక్షణ మంత్రి మంత్రి పీట్ హెగ్‌సేత్, ఆర్మీ చీఫ్ రాండీ జార్జ్నును పదవి నుంచి తప్పుకుని పదవీవిరమణ చేయాలని కోరినట్లు వెల్లడైంది. యుద్ధ సమయంలోనే అత్యున్నత సైనికాధికారిపై ఈ నిర్ణయం తీసుకోవడం పెద్ద చర్చకు దారితీసింది.
ర్యాండీ జార్జ్ 2023 నుంచి అమెరికా ఆర్మీకి నాయకత్వం వహిస్తున్నారు. ఇరాక్, అఫ్గానిస్థాన్ యుద్ధాల్లో అనుభవం ఉన్న ఆయన, రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించారు. అలాంటి అధికారి అకస్మాత్తుగా తప్పుకోవాల్సి రావడం, పెంటగాన్‌లో లోపల జరుగుతున్న మార్పులపై సందేహాలు పెంచుతోంది.
ఈ నిర్ణయానికి అధికారిక కారణం వెల్లడించకపోవడం పరిస్థితిని మరింత సీరియస్‌గా మారుస్తోంది. యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే నాయకత్వ మార్పు ఎందుకు అవసరమైంది అన్న ప్రశ్న ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. జార్జ్ స్థానంలో తాత్కాలికంగా కొత్త నాయకత్వం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. సైనిక స్థావరాల్లో వ్యక్తిగత రక్షణ కోసం ప్రైవేట్ ఆయుధాలు తీసుకెళ్లేందుకు సైనికులకు అనుమతి విధానాన్ని సడలించారు. ఇప్పటివరకు కఠినంగా ఉన్న నియమాలను మార్చి, ఇప్పుడు అనుమతులను సులభతరం చేశారు. ఈ మార్పు భద్రత కోణంలో తీసుకున్నదని ప్రభుత్వం చెబుతున్నా, విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
విమర్శకుల వాదన ఏమిటంటే, ఈ నిర్ణయం భద్రత పెంచడం కంటే కొత్త ప్రమాదాలకు దారితీయొచ్చని. ముఖ్యంగా సైనిక స్థావరాల్లో అంతర్గత హింస, ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ రెండు నిర్ణయాలు కలిసి ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నాయి. బయట యుద్ధం కొనసాగుతుండగా, లోపల అమెరికా రక్షణ వ్యవస్థలో పెద్ద మార్పులు జరుగుతున్నాయి. నాయకత్వ మార్పు, భద్రతా విధానాల్లో సడలింపులు—ఇవి రెండూ కలిసి రాబోయే రోజుల్లో మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.
యుద్ధ సమయంలోనే ఆర్మీ చీఫ్ ఔట్..? అమెరికాలో డబుల్ నిర్ణయం సంచలనం
9
Published on: 📅 03 Apr 2026, 08:13 AM
Reported by: 🖊
Eswar Pavan