ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయాన్వేషణకు తెరపడింది. ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 46, యశస్వి జైస్వాల్ 39 పరుగులతో మంచి ఆరంభం ఇచ్చినా, తర్వాతి బ్యాటర్లు విఫలమవడంతో స్కోరు ఎక్కువగా పెరగలేదు. వరుణ్ చక్రవర్తి, నరైన్, త్యాగి అద్భుత బౌలింగ్‌తో రాజస్థాన్‌ను కట్టడి చేశారు.
చిన్న లక్ష్యమే అయినప్పటికీ, కేకేఆర్‌కు ఛేదన అంత సులభం కాలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సీఫర్ట్, రహానె డకౌట్‌గా వెనుదిరగడం, తర్వాత గ్రీన్ ఔట్ కావడంతో ఒత్తిడి పెరిగింది. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 51/3గా ఉండడంతో మ్యాచ్ రాజస్థాన్ వైపు మళ్లినట్లు కనిపించింది. మధ్యలో రఘువంశీ, పావెల్, రమణ్‌దీప్ కూడా త్వరగా ఔట్ కావడంతో 14 ఓవర్లకు 87/6తో కేకేఆర్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
అయితే ఈ దశలో రింకు సింగ్, అనుకుల్ రాయ్ అద్భుతంగా పోరాడారు. రింకు సింగ్ తన అనుభవాన్ని ఉపయోగించుకుని ఒత్తిడిని తట్టుకుని ఆడగా, అనుకుల్ రాయ్ సరైన సమయంలో బౌండరీలు కొడుతూ మద్దతు ఇచ్చాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను పూర్తిగా మలిచారు. ముఖ్యంగా రింకు సింగ్ 34 బంతుల్లో 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.
చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమైన సమయంలో రింకు వరుసగా రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు మ్యాచ్ హీరోగా నిలిచాడు. అనుకుల్ రాయ్ కూడా 29 పరుగులతో కీలక పాత్ర పోషించాడు.
మరోవైపు రాజస్థాన్ బౌలర్లు ప్రారంభంలో మెరుగ్గా రాణించినప్పటికీ, చివర్లో ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. జడేజా రెండు వికెట్లు తీసినా, మ్యాచ్‌ను కాపాడలేకపోయాడు. మొత్తం మీద రింకు సింగ్ సూపర్ ఇన్నింగ్స్‌తో కేకేఆర్ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది.
రింకు సింగ్ రచ్చ ,కేకేఆర్‌కు తొలి విజయం
5
Published on: 📅 20 Apr 2026, 06:48 AM
Reported by: 🖊
Eswar Pavan