దేశంలో నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. తాజాగా ప్రతిపాదిత మార్పుల ప్రకారం లోక్‌సభ సీట్లు ప్రస్తుత 543 నుంచి 850కి పెరిగే అవకాశం ఉందన్న సమాచారం వెలుగులోకి రావడంతో అన్ని పార్టీల్లో చర్చ మొదలైంది. ఇందులో భాగంగా రాష్ట్రాల వారీగా కూడా గణనీయమైన పెంపులు ఉండనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 లోక్‌సభ సీట్లు 38కి పెరిగే అవకాశం ఉండగా, తెలంగాణలో 17 నుంచి 26కి పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో అసెంబ్లీ స్థానాలు కూడా భారీగా పెరగనున్నాయి. ఏపీలో 175 నుంచి 263కి, తెలంగాణలో 119 నుంచి 179కి చేరే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. మొత్తంగా దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు 4,123 నుంచి 6,185కి పెరగవచ్చని సమాచారం.
కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులను 2029 సాధారణ ఎన్నికల నాటికి అమల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ముందుగా డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసి ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. సీట్ల పెంపుతో పాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని చెప్పబడుతోంది.
ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ల అమలు అంశం కూడా ఈ చర్చలో కీలకంగా మారింది. జనగణన పూర్తైన తర్వాతే పునర్విభజన చేపట్టాలని కేంద్రం భావిస్తుండగా, 2027 నాటికి జనాభా లెక్కలు పూర్తి అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఆ తర్వాత కొత్త లెక్కల ఆధారంగా సీట్ల పెంపు అమలు చేసే అవకాశం ఉంది.
అయితే ఈ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ఆధారంగా పునర్విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకు అధిక ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉండగా, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దీనిని సమతుల్యం చేయడానికి అన్ని రాష్ట్రాల్లో సగటున 50 శాతం సీట్లను పెంచే విధానాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం.మొత్తంగా చూస్తే ఈ పునర్విభజన కేవలం సీట్ల పెంపు మాత్రమే కాదు. భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే కీలక పరిణామంగా మారే అవకాశముంది.
లోక్‌సభ 543 నుంచి 850కి ఏపీ తెలంగాణలో సీట్ల పెంపు భారీ మార్పులు
13
Published on: 📅 15 Apr 2026, 10:21 AM
Reported by: 🖊
Eswar Pavan