కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున ముండా మాట్లాడుతూ, సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం కేవలం డిగ్రీలను పంపిణీ చేయడానికే పరిమితం కాకూడదని, వైవిధ్యానికి పెద్దపీట వేయాలని సూచించారు. రూ. 800 కోట్లతో ఈ యూనివర్సిటీ నిర్మాణానికి కృషి జరుగుతోందన్నారు. గిరిజన సమస్యలను, స్థానిక సంస్కృతులను పరిశోధించి, గిరిజనుల అభివృద్ధికి కేంద్రంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రాంగణాన్ని క్రీడా యూనివర్సిటీగా కూడా ఉపయోగించాలని సూచించారు.